SC Sub Category: అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొలిసారి చుక్కెదురైంది. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఓ జిల్లాలో పర్యటిస్తుండగా కొందరు అడ్డగించారు. తమ సమస్యపై చంద్రబాబును నిలదీశారు. తమకు మద్దతుగా నిలవాలని నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం శుక్రవారం గ్రామసభలను నిర్వహించింది. గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామసభ ద్వారా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం కోసం సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించారు. ఆ జిల్లాలోని వానపల్లి గ్రామ సభకు ముఖ్యమంత్రి చేరుకుంటున్న సమయంలో కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. మాల సంఘాల ప్రతినిధులు కొందరు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులు ఖంగు తిన్నారు. ముఖ్యమంత్రి వచ్చే వేళ నిరసన జరగడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.
వానపల్లిలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభ వద్ద మాల సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను సభ నుంచి బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో త్వరలోనే వర్గీకరణ అమల్లోకి రానుంది. కాగా వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాల సంఘాలు చంద్రబాబు వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్గీకరణను ఏపీలో అమలు చేయవద్దని మాల సంఘాలు కోరుతున్నాయి.
ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు మాల సంఘాల ప్రతినిధులు ప్రయత్నించారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయవద్దని మాల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. వర్గీకరణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వర్గీకరణకు వ్యతిరేకంగా ఇటీవల మాల సంఘాలు భారత్ బంద్ కూడా నిర్వహించాయి. భవిష్యత్‌లో వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాల సంఘాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌ